ఎమ్మెల్యే రసమయికి షాక్... !

by Dishanational1 |
ఎమ్మెల్యే రసమయికి షాక్... !
X

దిశ, గన్నేరువరం: మండల కేంద్రం గన్నేరువరం నుండి మైలారం గ్రామానికి తారు రోడ్డు నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఇచ్చిన మాటలు నీటి మూటగానే మిగిలిపోయాయని ఆ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. తమ గ్రామానికి సుమారు రూ. కోటి 26 లక్షల నిధులతో తార్ రోడ్డు వేయనున్నట్లు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నాలుగేళ్ల కిందట ప్రకటించగానే మైలారం సాంబయ్యపల్లి గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు.


తీరా నాలుగేళ్లు గడిచినప్పటికీ రోడ్డు మాటే మరిచారని, మైలారం రోడ్డుకు కేటాయించిన నిధులు మరో ప్రాంతానికి తరలివెళ్లినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిధులు మళ్లింపుతోనే మైలారం రోడ్డు పనుల ఊసే ఎమ్మెల్యే ఎత్తడం లేదని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. రోడ్డు గుంతలు పడి ఉండడంతోపాటు దుమ్మురేగుతుందని, మండల కేంద్రానికి రావడానికి మైలారం, సాంబయ్యపల్లి, హనుమాజిపల్లి గ్రామాల ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. పాలాభిషేకం చేసిన ప్రజలే రోడ్డు నిర్మాణం ఏమైందని ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నారు.

మైలారం గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రం మల్లికార్జున స్వామి ఆలయం ఉండగా ఈ ఆలయ దర్శనానికి వివిధ రాష్ట్రాల నుండి జిల్లాల నుండి భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుంది. భక్తులు గ్రామానికి చేరుకోవడానికి సరైన రోడ్డు మార్గం లేక అవస్థలు పడుతున్నారు. మైలారం గ్రామానికి సమీపంలో చాకలి కుంట వద్ద కల్వర్టు నిర్మాణం సరిగా లేకపోవడంతో వర్షాకాలం నీరు రోడ్డుపై నుండి ప్రవహించడంతో రాకపోకలు ఆగిపోతున్నాయి. పాఠశాల విద్యార్థులు, పొలాల కాడికి పోయే రైతులు, మండల కేంద్రానికి వెళ్లే ప్రజలు రోడ్డు సరిగా లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు నిర్మాణం చేపట్టకపోతే త్వరలోనే రోడ్డు సాధనకు ప్రజలంతా ఉద్యమించడానికి సిద్ధమవుతున్నారు.

మైలారం రోడ్డు నిర్మాణం పనులు వెంటనే చేపట్టాలి: బీజేపీ మానకొండూరు అసెంబ్లీ కన్వీనర్

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు, మండల ప్రజా ప్రతినిధులకు చిత్తశుద్ధి ఉంటే గతంలో మంజూరు చేసిన నిధులతో మైలారం గ్రామానికి వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలి. లేనిపక్షంలో మైలారం, సాంబయ్యపల్లె గ్రామాల ప్రజల సహకారంతో రోడ్డు సాధనకు ఉద్యమం చేయపడుతాం. మైలారం గ్రామం సుడా పరిధిలో ఉన్నందున మానేరు తీర ప్రాంత గ్రామాల అభివృద్ధికి సుడా నిధులు కేటాయిస్తున్నట్లు నాయకులు ప్రకటన చేసినప్పటికీ గ్రామంలో ఏ ఒక్క అభివృద్ధి పని ప్రారంభం కాలేదు. ఇప్పటికైనా రోడ్డు నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలి.

Next Story

Most Viewed